భారీతనాన్ని ఉట్టిపడేలా చేసే వీఎఫ్ఎక్స్ వర్క్స్ అందుబాటులోకి వచ్చాకా సినీ జనాల దృష్టి పురాణాలమీద, చారిత్రక ప్రాధాన్యత ఉన్న కథల మీద, జానపదాల మీద పడింది. ముందుగా హాలీవుడ్ వాళ్లు ఈ రూట్లో కొన్ని సినిమాలు రూపొందించి సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో భారతీయ సినిమా వాళ్లు కూడా ఈ రూటును అందుకున్నారు. ఇప్పటికే ఈ పరంపరలో కొన్ని సినిమా రాగా, వస్తుండగా.. ఇదే సమయంలో మహాభారత గాథను అనుసరించి సినిమాను తీయాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంది.

వీరిలో కొందరు తమ ఉద్దేశాన్ని ఇప్పటికే తెలియజేశారు కూడా. ఇలా చెప్పిన వారిలో దర్శకుడు రాజమౌళితో సహా అనేక మంది ఉన్నారు. మహాభారతాన్ని తెరకెక్కించాలని ఉందని వీరు చెప్పుకొచ్చారు. మరి వీరి ప్రయత్నాల సంగతేమో కానీ.. ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్ ను సినిమాగా తెరకెక్కించే ప్రతిపాదన వినిపిస్తోంది మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి.

రంధమూలం మహాభారత గాథలోని కొన్ని పర్వాలను ఆధారంగా చేసుకుని మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన నవల ఇది. కురుపాండవులే ఈ రచనలో ప్రధాన పాత్రధారులు. దీన్ని సినిమా తీసుకొచ్చే ఉద్దేశం ఉంది మోహన్ లాల్ కు. మూడేళ్ల కిందటే ఈ ప్రతిపాదన వచ్చినా.. అందుకో పట్టాలెక్కలేదు. అయితే తాజాగా లాల్ మాట్లాడుతూ.. రంధమూలం ను సినిమాగా తీసుకొస్తానని వ్యాఖ్యానించాడు.

దానికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా లాల్ ప్రకటించడమే ఇక్కడ అత్యంత విశేషం. భారత దేశ సినీ చరిత్రలోనే ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన సినిమాలేవీ ఇంత వరకూ లేవు. ఇదే జరిగితే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమా నిలుస్తుంది.

నవల భీమసేనుడు ప్రధాన పాత్రగా సాగుతుందట. ఆ పాత్రను మోహన్ లాల్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో భీష్ముడి పాత్రకు అమితాబ్ ను, అర్జునుడి పాత్రకు విక్రమ్ ను ,ద్రౌపది పాత్రకు ఐశ్వర్యరాయ్ ను తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యపాత్రను చేయబోతున్నాడట. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ప్రతిపాదన ఉందని సమాచారం. మరి అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిపాదనలో ఉన్న ఈ మహాభారతగాథ ఏ మేరకు పట్టాలెక్కుతుందో చూడాలి!

Source : Great Andhra